లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ. 10.50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యవహారంలో ప్రముఖ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వహకురాలు రమానందనకు ప్రకాశం జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ మోసం కేసుకు సంబంధించి ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఆమెకు నోటీసులు జారీ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం పేరాయపాలెంకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కోడలికి లండన్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నందన తమ వద్ద నుండి రూ. 10.50 లక్షలు వసూలు చేసినట్లు అద్దంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో అనేకమందికి ఉద్యోగాలు ఇప్పించానని చెప్పడంతో విడతల వారీగా ఈ మొత్తాన్ని ఆమెకు బదిలీ చేశామని, అయితే ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని బాధితుడు తెలిపారు. దీంతో జులై 4న పోలీసులు నందనపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యూకే ఉద్యోగాలు, వీసాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు గతంలో ఎన్టీఆర్ జిల్లాలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల లుక్అవుట్ నోటీసుల కారణంగా ఇటీవలే హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ మోసాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అంతా తన భర్తే చూసుకుంటారని గత విచారణలో నందన తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం అద్దంకి పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు తీవ్రతరం చేశారు.

