తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు
మిల్లింగ్ ఛార్జీ క్వింటాల్‌కు రూ.150కు పెంచాలి
పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి
నిజామాబాద్‌లో రైస్ మిల్లర్ల ధర్నా
నిజామాబాద్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: శివ ఠాకూర్).
తనిఖీల పేరుతో నిజాయితీగా పనిచేస్తున్న రైస్ మిల్లర్లను వేధించవద్దని నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ది నిజామాబాద్ డిస్ట్రిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు డిమాండ్లను వినిపించారు.
పెరిగిన పెట్టుబడులు, విద్యుత్ ఛార్జీలు, హమాలీ ఖర్చులు తదితర కారణాలతో రైస్ మిల్లుల నిర్వహణ భారంగా మారిందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మిల్లింగ్ ఛార్జీని క్వింటాల్‌కు రూ.150కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇప్పటికే సుమారు ఎనిమిది నెలలుగా తమకు రావాల్సిన మిల్లింగ్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో మిల్లర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
మిల్లులకు ధాన్యం కేటాయించిన మూడు నెలల్లోపు బియ్యాన్ని ప్రభుత్వం తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ధాన్యం ఎక్కువ కాలం మిల్లుల్లో నిల్వ ఉండటంతో నిల్వ, నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
అలాగే బాయిల్డ్ రైస్ రేషియో తేలకముందే కొత్త పంట ధాన్యాన్ని మిల్లులకు కేటాయించవద్దని కోరారు. ఎండకాలం పంటలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పచ్చి బియ్యం ఇవ్వడం సాధ్యం కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో బాయిల్డ్ బియ్యం మాత్రమే ఇవ్వగలమని తెలిపారు.పంట నాణ్యత, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సార్టెక్స్ రిజెక్షన్స్, నూకల కారణంగా ఏర్పడే తరుగు నష్టాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మిల్లింగ్ ఒప్పందం ఇరుపక్షాలకు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తనిఖీల పేరుతో మిల్లర్లను ఇబ్బందులకు గురిచేయకుండా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని రైస్ మిల్లర్లు విజ్ఞప్తి చేశారు.

