Breaking News

క్వాలిఫైడ్ డాక్టర్ల సేవలు అమూల్యం.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎంహెచ్‌వో డా. బి. రాజశ్రీ

క్వాలిఫైడ్ డాక్టర్ల సేవలు అమూల్యం.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎంహెచ్‌వో డా. బి. రాజశ్రీ

జిల్లా ప్రజలకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

అనారోగ్యానికి గురైతే క్వాలిఫైడ్ డాక్టర్లను మాత్రమే సంప్రదించాలని సూచన

జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం 100 శాతానికి మించి విజయవంతం కావడంపై సిబ్బందికి అభినందనలు

నిజామాబాద్, జూలై 1:

జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా జిల్లా ప్రజలకు నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డా. బి. రాజశ్రీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో క్వాలిఫైడ్ డాక్టర్ల సేవలు అత్యంత విలువైనవని, ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

మనిషి జీవితంలో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, అయితే ఆరోగ్య విషయంలో మాత్రం మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సూక్తిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కోసం ఆందోళన చెందడం కంటే, వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు.

ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే తప్పనిసరిగా క్వాలిఫైడ్ డాక్టర్లను మాత్రమే సంప్రదించాలని, అనధికార వైద్యులను ఆశ్రయించి తమ అమూల్యమైన ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమయానికి పోషకాహారం తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లు మంచి ఆరోగ్యానికి పునాది అని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం నూటికి నూరు శాతానికి మించి విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, ఎన్‌సీసీ వాలంటీర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలకు ప్రజలు ఇదే విధంగా సహకరించాలని కోరుతూ, మరోసారి జిల్లా ప్రజలందరికీ జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *