Breaking News

గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం

ఏడాదిలో 7 టన్నుల గంజాయి స్వాధీనం – అంతర్‌రాష్ట్ర ముఠాలపై ఉమ్మడి ఆపరేషన్లు

NCB, DRI, పొరుగు రాష్ట్రాల పోలీసులతో సంయుక్త దాడులు

ఆల్ప్రాజోలమ్, గంజాయి కేసుల్లో భారీ స్వాధీనం – RNCC కఠిన చర్యలు

165 మంది వినియోగదారులకు డీ-అడిక్షన్ చికిత్స – 492 అవగాహన కార్యక్రమాలు

    యాంటీ డ్రగ్ సోల్జర్”గా ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి: పోలీసులు


      నిజామాబాద్ జూలై 27:E6 tv NEWS శివ ఠాకూర్.

      రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టే లక్ష్యంతో తెలంగాణ పోలీసుల ఈగల్ ఫోర్స్ దూకుడు కొనసాగిస్తోంది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా విస్తరించిన గంజాయి సరఫరా గొలుసును ఛేదించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు, పొరుగు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ నిర్వహిస్తున్న సంయుక్త ఆపరేషన్లలో గత ఏడాదిలో దాదాపు 7 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

      అంతర్‌రాష్ట్ర ఆపరేషన్లతో భారీ విజయాలు

      ఎన్‌సీబీ (NCB), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల పోలీసులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో రాంచీ, కోరాపుట్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కో ఆపరేషన్‌లో 500 కిలోల చొప్పున గంజాయిని స్వాధీనం చేసుకుని అక్రమ రవాణా ముఠాలపై గట్టి దెబ్బ కొట్టినట్లు పేర్కొన్నారు.

      సరఫరా గొలుసు విచ్ఛిన్నమే లక్ష్యం

      డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే కేవలం రవాణాదారులపై చర్యలు సరిపోవని, మొత్తం సప్లై చైన్‌ను విచ్ఛిన్నం చేయడమే ప్రధాన లక్ష్యమని ఈగల్ ఫోర్స్ స్పష్టం చేసింది. డ్రగ్స్‌పై డిమాండ్ తగ్గించేందుకు చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

      నిజామాబాద్ కమిషనరేట్‌లో RNCC కఠిన చర్యలు

      నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఆర్‌ఎన్‌సీసీ (RNCC) విభాగం ఎన్‌డీపీఎస్ చట్టం కింద పలు కేసులు నమోదు చేసి భారీగా ఆల్ప్రాజోలమ్, గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఆదిలాబాద్‌లో 864 కిలోల గంజాయి, బోధన్ రూరల్‌లో 2.5 కిలోల ఆల్ప్రాజోలమ్, నందిపేట్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, ముప్కాల్, జుక్కల్ తదితర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో మొత్తం 5.206 కిలోల ఆల్ప్రాజోలమ్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

      కమర్షియల్ కేసులు తగ్గుముఖం

      2024తో పోలిస్తే 2025లో కమర్షియల్ క్వాంటిటీ కేసులు 8 నుంచి 2కు తగ్గడం పోలీసుల నిరంతర చర్యల ఫలితమని అధికారులు తెలిపారు. 2025–26లో 165 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించి డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపించి, చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

      492 అవగాహన కార్యక్రమాలు

      డ్రగ్స్ దుష్ప్రభావాలపై 2024 నుంచి ఇప్పటివరకు 492 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, వాటిలో 192 కార్యక్రమాలు కల్తీ కల్లు, మత్తు పదార్థాల ప్రమాదాలపై ప్రత్యేకంగా నిర్వహించినట్లు వెల్లడించారు.

      ప్రజల సహకారం కోరిన పోలీసులు

      డ్రగ్స్ విక్రయం, రవాణా, గంజాయి సాగు, నిల్వ లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే యాంటీ డ్రగ్ టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా వాట్సాప్ నంబర్ 8712671111కు తెలియజేయాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

      యువతకు పిలుపు

      Say No to Drugs – Say Yes to Life”, “గంజాయి వద్దు… ప్రాణం ముద్దు” అనే సందేశాన్ని ప్రతి యువకుడు ఆచరణలో పెట్టాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *