హైదరాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: ప్రతినిధి)
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపకుండా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరింది.టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సోమవారం సచివాలయంలో సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించారు.
కేబుల్, ఐపీ న్యూస్ ఛానళ్లకు అక్రెడిటేషన్
రాష్ట్రంలోని కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లకు వెంటనే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. అలాగే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారిత న్యూస్ ఛానళ్లకు కూడా అక్రెడిటేషన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కేబుల్ ఛానళ్లకు జిల్లాస్థాయిలో నాలుగు, రాష్ట్రస్థాయిలో 12 అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు
అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఫెడరేషన్ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా చట్టపరమైన మార్గాలను పరిశీలించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. విధి నిర్వహణలో లేదా ఇతర కారణాలతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను కూడా ఈ పథకంలో పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను గుర్తించి ప్రత్యేక సంక్షేమ చర్యలు చేపట్టాలని కోరారు.
పెండింగ్ ప్రకటనల బిల్లులు చెల్లించాలి
చిన్న, మధ్యతరహా పత్రికలకు గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ప్రకటనల బిల్లులను వెంటనే చెల్లించాలని టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేసింది. చిన్న, మధ్యతరహా పత్రికలను ప్రభుత్వ ప్రకటనల ఎంపానెల్మెంట్లో చేర్చి వాటి మనుగడకు సహకరించాలని కోరింది.
రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్
సీనియర్, రిటైర్డ్ జర్నలిస్టుల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఫెడరేషన్ కోరింది. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత విద్య అందించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే జర్నలిస్టులందరికీ ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించి, జర్నలిస్టు మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి రూ.10 లక్షల బీమా పరిహారం అందేలా పథకం అమలు చేయాలని కోరారు.జర్నలిస్టుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చినట్లు టీడబ్ల్యూజేఎఫ్ నేతలు తెలిపారు.మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, కో-కన్వీనర్లు ఆర్. శ్రీనివాస్ గౌడ్, ఎస్. రవికుమార్ తదితరులు ఉన్నారు.

