హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల విఫల పాలనపై అసెంబ్లీలో ప్రశ్నించేందుకు వెళ్లిన ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై పోలీసులు కిరాతకంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ కాస్తా ‘దుశ్శాసన సభ’గా మారిపోయిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పోలీసుల అనాగరిక ప్రవర్తన వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు.
కేటీఆర్ ప్రసంగంలోని ప్రధాన ముఖ్యాంశాలు:
- మహిళా నేతలపై దౌర్జన్యం: రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి రాకముందే మంత్రులుగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వంటి సీనియర్ మహిళా నేతల జుట్టు పట్టుకుని, గొంతు పిసికే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
- సునీతమ్మ కంటనీరు:“పోలీసులు సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగుతుంటే.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమయానికి అడ్డుకోకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. సీనియర్ నాయకురాలు సునీతమ్మ కంటనీరు పెట్టుకోవడం చూశాక ఇది శాసనసభో, దుశ్శాసన సభో అర్థం కావట్లేదు.”
- కాంగ్రెస్ ద్వంద్వ నీతి: ఢిల్లీలో రాహుల్ గాంధీ నిరసనలు తెలుపుతూ ‘స్మాష్ ది పాట్రియార్కీ’ అని ఉచిత సలహాలు ఇస్తారని, కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఎమ్మెల్యేలపై ఉక్కుపాదం మోపుతోందని ఎద్దేవా చేశారు.
- శాంతియుత నిరసనే: తాము పార్లమెంట్లో రాహుల్ గాంధీ తరహాలోనే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించామని, ఎలాంటి అన్-పార్లమెంటరీ భాష వాడలేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ప్రతిపక్ష నేతలపై జరిగిన ఈ దాడిపై ప్రజాస్వామ్యవాదులు స్పందించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

