Breaking News

అసెంబ్లీనా.. కౌరవసభనా?

ప్రజాస్వామ్య సభలో పోలీసు రాజ్యం అంటూ బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం

మఠంపల్లి, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాల్సిన అసెంబ్లీలోనే ప్రజాప్రతినిధులపై పోలీసుల దాడులు జరగడం ఏమిటని ప్రశ్నిస్తూ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.మండల బీఆర్‌ఎస్ నాయకులు ఇరుగు పిచ్చయ్య, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల కూడా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తదితరులపై కూడా పోలీసులు దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన ప్రజాప్రతినిధులపై పోలీసు బలాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.

“ప్రజాస్వామ్యానికి నిలయమైన అసెంబ్లీలోనే ప్రజాప్రతినిధులపై దాడులు జరిగితే.. అది అసెంబ్లీనా? లేక కౌరవసభనా?” అంటూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించారు.ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల గొంతును అణచివేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల దౌర్జన్యాలు కొనసాగితే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ నిరసనలో మఠంపల్లి మండల బీఆర్‌ఎస్ నాయకులు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, మాజీ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *