Breaking News

ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో షార్ట్ సర్క్యూట్

తప్పిన పెను ప్రమాదం.. పలు రికార్డులు, ఫర్నిచర్ దగ్ధం

ఇల్లెందు, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి)

ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. బస్టాండ్ ఆవరణలోని కంట్రోలర్ గదిలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. అయితే ఘటన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో కంట్రోలర్ గదిలో ఉన్న పలు రికార్డులు, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

కాగా, ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్ భవనం శిథిలావస్థకు చేరిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్లాబ్ పెచ్చులు ఊడిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని, బస్టాండ్‌లోని విద్యుత్ వైర్లు కూడా పాతబడిపోయాయని చెబుతున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం భయాందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

ఘటన స్థలాన్ని డిపో మేనేజర్ పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బస్టాండ్ భవనానికి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టడంతో పాటు పాత విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించి ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *