Breaking News

భీమ్‌గల్ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది: వేముల ప్రశాంత్‌రెడ్డి

రూ.35 కోట్ల 100 పడకల ఆసుపత్రి, రూ.3.50 కోట్ల సమీకృత మార్కెట్, సీసీ–బీటీ రోడ్లు, బస్ డిపో పనులు పూర్తి చేయాలి


పెండింగ్ బిల్లులు విడుదల చేసి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్

భీమ్‌గల్ ఆగస్ట్ 19: (E6tv NEWS ప్రతినిధి).

భీమ్‌గల్ పట్టణ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై, 70–75 శాతం వరకు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసి అర్ధాంతరంగా నిలిపివేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం విలాసాలకు, ఇతర కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి భీమ్‌గల్ అభివృద్ధికి రూ.15–20 కోట్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదని విమర్శించారు. భీమ్‌గల్ పట్టణ అభివృద్ధిపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బస్ డిపోను నిరుపయోగంగా మార్చారు

గత కాంగ్రెస్ పాలనలో మూతపడిన భీమ్‌గల్ ఆర్టీసీ బస్ డిపోను బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో రూ.2.25 కోట్లతో మరమ్మతులు చేయించి పునరుద్ధరించామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. డిపో మేనేజర్‌ను నియమించి బస్సు సర్వీసులు నడిపామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిపో మళ్లీ నిరుపయోగంగా మారిందని అన్నారు. ప్రస్తుతం అక్కడ ఒక చౌకీదార్ మాత్రమే ఉన్నారని, ప్రాంగణం పిచ్చిమొక్కలతో నిండిపోయిందని, కూలిన ప్రహరీ గోడను కూడా ప్రభుత్వం బాగు చేయడం లేదని విమర్శించారు.

సీసీ, బీటీ రోడ్ల పనులు నిలిచిపోయాయి

భీమ్‌గల్ పట్టణంలో ఇప్పటికే రూ.25 కోట్లతో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన గల్లీల అభివృద్ధి కోసం ఎన్నికలకు ముందే మరో రూ.10 కోట్లు, ఫంక్షన్ హాల్ తదితర పనులతో కలిపి రూ.12 కోట్లు మంజూరు చేయించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. అయితే కాంట్రాక్టర్లకు గత 7–8 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఆరోపించారు.

సమీకృత మార్కెట్ పనులు కూడా అసంపూర్తి

ప్రజలు, చిరువ్యాపారుల సౌకర్యార్థం రూ.3.50 కోట్లతో చేపట్టిన సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌లో 50 శాతానికి పైగా పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశామని తెలిపారు. సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయని, ప్రస్తుతం మార్కెట్ ప్రాంగణం పిచ్చిచెట్లు, పందుల సంచారానికి నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

100 పడకల ఆసుపత్రి పూర్తి చేయాలి

భీమ్‌గల్‌లో నిబంధనల ప్రకారం 30 పడకల ఆసుపత్రికి మాత్రమే అవకాశం ఉన్నప్పటికీ, మారుమూల ప్రాంత ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులను ఒప్పించి రూ.35 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో రూ.22 కోట్లు భవన నిర్మాణానికి, మిగిలిన నిధులు వైద్య పరికరాలకు కేటాయించామని చెప్పారు.ఎన్నికలకు ముందే సుమారు 15 నెలల్లో రూ.15 కోట్ల విలువైన పనులు పూర్తి చేయించి, కాంట్రాక్టర్‌కు రూ.13.50 కోట్ల మేర బిల్లులు ఇప్పించామని తెలిపారు. మొత్తం ప్రాజెక్టులో 70–75 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనుల కోసం ప్రభుత్వం వద్దకు వెళ్లగా రూ.5 కోట్లు ఇస్తామని అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. అయితే కేవలం రూ.2.27 కోట్లు మాత్రమే విడుదల చేశారని, గత ఆరు నెలలుగా ఒత్తిడి తెస్తున్నప్పటికీ సుమారు రూ.30 లక్షల విలువైన టైల్స్, ఫ్లోరింగ్ పనులు మినహా మిగతా పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు.

మహేష్‌కుమార్ గౌడ్ హామీ ఏమైంది?

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 9న భీమ్‌గల్ వచ్చిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ పట్టణాన్ని దత్తత తీసుకుంటానని, మూడు నెలల్లో రూ.5 కోట్లు విడుదల చేయించి 100 పడకల ఆసుపత్రితో పాటు ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్‌గా గెలిపించినప్పటికీ, మూడు నెలల గడువు ముగిసి ఆరు నెలలు కావస్తున్నా అదనంగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని విమర్శించారు.అసెంబ్లీలో ప్రశ్నించడంతో పాటు జూన్ 14న క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రభుత్వాన్ని హెచ్చరించామని, స్పందన లేకపోవడంతో జూలై 14న మంచి నీళ్లు కూడా ముట్టకుండా నిరాహార దీక్ష చేపట్టామని తెలిపారు. పోలీసులు నిర్బంధించినప్పటికీ ఇంట్లోనే దీక్ష కొనసాగించానన్నారు. ఆగస్టు 3న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందజేయగా 10 రోజుల్లో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, 15 రోజులు గడిచినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఆరోపించారు.

ఇతర కార్యక్రమాలకు కోట్లు.. భీమ్‌గల్‌కు నిధులు లేవా?

ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేవని చెబుతూ బడ్జెట్‌లో మంజూరైన అభివృద్ధి పనులను నిలిపివేయడం ప్రజాద్రోహమని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. హెలికాప్టర్ అద్దెకు రూ.111 కోట్లు, ఫుట్‌బాల్ కోర్టులకు రూ.10 కోట్లు, ఇతర కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి భీమ్‌గల్‌లో 100 పడకల ఆసుపత్రి, మార్కెట్, రోడ్ల పనులు పూర్తి చేసేందుకు అవసరమైన రూ.15–20 కోట్లు ఇవ్వడం ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు.

భీమ్‌గల్ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేసి, అసంపూర్తి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు రావాల్సిన సుమారు రూ.10 కోట్ల బకాయిలను విడుదల చేసి పనులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.అసెంబ్లీలో ప్రశ్నించినా, మంత్రులను కలిసినా, నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని అన్నారు. భీమ్‌గల్ అభివృద్ధి సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తదుపరి ఉద్యమ కార్యాచరణపై భీమ్‌గల్ ప్రజలే తనకు మార్గదర్శనం చేయాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ మహేష్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మొయిజ్, శర్మ నాయక్, తుకాజీ నాయక్, శివసారి నర్సయ్య, కౌన్సిలర్ నీలం రవి, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *