Breaking News

RTC ఛార్జీల మోత: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం!

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని విమర్శించింది.

హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్లే ఏసీ బస్సు ఛార్జీని ఉదాహరణగా చూపుతూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆగస్టు 20న రూ.410గా ఉన్న ఈ బస్సు ఛార్జీ, సెప్టెంబర్ 11 నాటికి రూ.570కి చేరిందని ఆరోపించారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఒక ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారాన్ని మోపడమేంటని ప్రశ్నించారు. కేవలం ఈ ఒక్క రూట్‌లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్గాల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా ఛార్జీలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

“మాటల్లో ఉచితాలు.. చేతల్లో ఛార్జీల మోత” మోగిస్తూ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని బీఆర్‌ఎస్ విమర్శించింది. సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన ప్రజా రవాణా వ్యవస్థను ఈ విధంగా భారం చేయడం సరైన విధానం కాదని హితవు పలికింది.

వెంటనే పెంచిన ఆర్టీసీ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ప్రజలపై భారాలు మోపే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఊరుకునేది లేదని, ప్రజల తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *