హైదరాబాద్: ఇథనాల్ బ్లెండింగ్ (పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం) ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న విమర్శలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ (UPA) ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ల కాలక్రమాన్ని (Chronology) బయటపెడుతూ వారిపై నిప్పులు చెరిగారు.
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాహుల్ గాంధీ దేశ ప్రజలకు “అబద్ధాలు” చెప్తున్నారని, విదేశీ దిగుమతులపై కేజ్రీవాల్ “అబద్ధపు ప్రచారాలు” చేస్తున్నారని కిషన్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు.
కిషన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- యూపీఏ పాలనలో ఇథనాల్ విధానం: 2012 నవంబర్ 22న కాంగ్రెస్ కేబినెట్ కమిటీ జూన్ 30, 2013 నాటికి పెట్రోల్‌లో 5 శాతం ఇథనాల్‌ను కలపడం తప్పనిసరి చేసిందని.. ఆ తర్వాత జనవరి 2, 2013న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో 10 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను విక్రయించాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
- యుపిఎ హయాంలో విదేశీ దిగుమతులు: నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి 140.4 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం కాగా, దేశీయంగా కేవలం 39.8 కోట్ల లీటర్లు మాత్రమే సరఫరా అందుబాటులోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ రైతుల నుండి ఇథనాల్ సేకరించే సామర్థ్యాన్ని పెంచలేక, 82.03 కోట్ల లీటర్ల ఇథనాల్ కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిందని వివరించారు.
- నేటి స్థానిక ఉత్పత్తి & పురోగతి: 2013–14 నాటికి కేవలం 38 కోట్ల లీటర్లుగా ఉన్న ఇథనాల్ సేకరణ, 2023–24 నాటికి 707 కోట్ల లీటర్లకు పెరిగిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం 1,050 కోట్ల లీటర్ల అవసరానికి గానూ, దేశీయ ఉత్పత్తిదారులు 1,776 కోట్ల లీటర్లను విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
- దిగుమతులపై పూర్తిగా నిషేధం: మే 2019 నుండి ఇంధనం కోసం విదేశాల నుండి ఇథనాల్‌ను దిగుమతి చేసుకోవడాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని, ప్రస్తుతం బ్లెండింగ్ కోసం ఉపయోగిస్తున్న ప్రతి లీటరు ఇథనాల్‌ను మన దేశీయ రైతుల నుంచే సేకరిస్తున్నామని స్పష్టం చేశారు.
తన ప్రకటనను ముగిస్తూ.. “ఆఖరుగా రాహుల్ గాంధీ గారూ… ముందుగా మీ కాంగ్రెస్ హయాంలో వచ్చిన జనవరి 2, 2013 నాటి గెజిట్ నోటిఫికేషన్‌పై మాట్లాడండి” అని సూటిగా ప్రశ్నించారు.

