హైదరాబాద్ :
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతను, ఇంజనీరింగ్ విద్యార్థులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్ర యువతకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ప్రెస్ మీట్లో కేటీఆర్ వ్యాఖ్యలు:
- అతిపెద్ద క్రిమినల్ వేస్ట్: 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి తెలంగాణపై సీఎం రూపంలో రుద్దడమే కాంగ్రెస్ చేసిన అతిపెద్ద “క్రిమినల్ వేస్ట్” అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
- నైతిక హక్కు లేదు: చదువుకున్న లక్షలాది మంది యువతను అవమానించే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదని.. అసలు ఆయన ఎప్పుడైనా పోటీ పరీక్ష రాశారా? వేరేవాళ్ల సాయం లేకుండా స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్ నింపే సామర్థ్యం ఉందా? అని ఎద్దేవా చేశారు.
- రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?: జాబ్ క్యాలెండర్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగులకు ఆశలు చూపి కాంగ్రెస్ దారుణంగా వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- యువత ఆత్మహత్యాయత్నాలు: ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారని, ఖమ్మం జిల్లాకు చెందిన గడ్డం వేణులాంటి ఎంతో మంది యువకులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- రాహుల్ గాంధీ మౌనం ఏంటి?: దేశంలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా మాట్లాడే రాహుల్ గాంధీ.. తెలంగాణ యువతకు జరుగుతున్న ఈ ద్రోహంపై, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు చేస్తున్న దాడులపై ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్ నిలదీశారు.

