Breaking News

జేబీఎస్–మేడ్చల్ మెట్రో కారిడార్ కోసం రోడ్డెక్కిన ప్రజలు: పాదయాత్ర చేపట్టిన స్థానికులు!

హైదరాబాద్: జేబీఎస్ – మేడ్చల్ మెట్రో కారిడార్‌ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, నిరసనకారులు ఆదివారం భారీ పాదయాత్ర చేపట్టారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో విడత (Phase-II) విస్తరణను వేగవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ జీడిమెట్ల నుండి జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మెట్రో హబ్ వరకు ఈ మార్చ్ నిర్వహించారు.

‘మేడ్చల్ మెట్రో సాధన సమితి’ (MMSS) ఆధ్వర్యంలో, ‘ది సిటిజన్స్ కౌన్సిల్’ మద్దతుతో జరిగిన ఈ పాదయాత్రలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు మెట్రో విస్తరణ తక్షణ అవసరమని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి వ్యవస్థాపకుడు సంపత్ రెడ్డి మామిడి మాట్లాడుతూ.. మేడ్చల్ మెట్రో కారిడార్ పనులు ప్రారంభమయ్యే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. “మేడ్చల్ మెట్రోకు సంబంధించి మొదటి పిల్లర్ పడే వరకు మా పోరాటం ఆగదు” అని ఆయన తేల్చిచెప్పారు.

హైదరాబాద్ రవాణా అవసరాలను తీర్చడంలో జేబీఎస్-మేడ్చల్ కారిడార్ తో పాటు రాయదుర్గం-శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ అత్యంత కీలకమైనవని నిర్వాహకులు తెలిపారు. ఈ రెండు కారిడార్లు అందుబాటులోకి వస్తే లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందడమే కాకుండా, ట్రాఫిక్ తగ్గుతుందని, రవాణా అనుసంధానం పెరిగి భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటికీ జేబీఎస్ – మేడ్చల్ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా ఆమోదం లభించకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆలస్యం వల్ల ఉత్తర హైదరాబాద్‌వాసులు సురక్షితమైన, వేగవంతమైన, పర్యావరణ అనుకూల ప్రజా రవాణా వ్యవస్థకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సహకారం అందిస్తున్నప్పటికీ.. ఇతర నగరాలతో పోలిస్తే తగినంత మెట్రో విస్తరణ జరగలేదని సిటిజన్స్ కౌన్సిల్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

జీడిమెట్లలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర, ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ జేబీఎస్ మెట్రో హబ్ వద్ద ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *