హైదరాబాద్: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో హైదరాబాద్ సిటీ పోలీసులు తొలిసారిగా కృత్రిమ మేధస్సు (AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత రద్దీ నిర్వహణ (Crowd Management) వ్యవస్థను వినియోగించారు. అధునాతన ‘ఫేషియల్ రికగ్నిషన్’ (ముఖాలను గుర్తించే) సాంకేతికత సహాయంతో మహిళలను వేధిస్తున్న వారితో పాటు, వివిధ నేరాలకు పాల్పడుతున్న 13 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సాంకేతికత ద్వారా సికింద్రాబాద్ జోనల్ IT బృందం ఒక అనుమానితుడు భక్తుడిని దోచుకోవడానికి ప్రయత్నించడాన్ని సీసీ కెమెరాల్లో గమనించింది. వెంటనే సాదాసీదా దుస్తుల్లో ఉన్న ‘షీ టీమ్స్’ సిబ్బందికి సమాచారం అందించగా, ఆ అనుమానితుడిని అక్కడికక్కడే పట్టుకున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ.. “ఈ తరహా వ్యవస్థను భవిష్యత్తులో జరిగే భారీ కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తాం. త్వరలోనే దీన్ని డ్రోన్లకు కూడా అనుసంధానిస్తాం. AI సాంకేతికతతో నేరాలను అరికట్టడం, నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయడం చాలా సులువవుతుంది. దీనిపై ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నాం” అని తెలిపారు. మహంకాళి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మూడు పెద్ద మానిటర్ల ద్వారా ఈ AI సిస్టమ్ పనితీరును ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సాంకేతికత పనితీరుపై ట్రాఫిక్ డిసిపి అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. ముఖాలను గుర్తించడమే కాకుండా, ఆలయంలోకి ప్రవేశించే, వెలుపలికి వచ్చే భక్తుల సంఖ్య, క్యూలైన్లలో ఉన్న జనాన్ని విశ్లేషించి అకస్మాత్తుగా పెరిగే రద్దీని ముందే అంచనా వేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ అధునాతన సాఫ్ట్వేర్ను వాడుతున్నారని, దీనిని నగరంలోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కూడా పర్యవేక్షించవచ్చని BYC AI వ్యవస్థాపకుడు, సీఈఓ సయ్యద్ అమ్జద్ హుస్సేన్ తెలిపారు.

