వరంగల్ / మహబూబాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు హాస్టళ్లలో విద్యార్థినుల భద్రత, పర్యవేక్షణ తీరుపై తీవ్ర అనుమానాలను, కలకలాన్ని రేకెత్తిస్తున్నాయి. వరుసగా హాస్టళ్ల నుంచి విద్యార్థినులు బయటకు వెళ్ళిపోతుండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.
మహబూబాబాద్‌లో ఇద్దరు డిగ్రీ విద్యార్థినుల గల్లంతు:
మహబూబాబాద్ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు సడన్‌గా కనిపించకుండా పోయారు. కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో మహబూబాబాద్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు 24 గంటల్లోనే ఆ విద్యార్థినుల అడ్రస్ కనుగొని, క్షేమంగా కుటుంబసభ్యులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమర్థవంతంగా పనిచేసి విద్యార్థినులను పట్టుకున్న పోలీసులను పలువురు అభినందించారు.
శాయంపేట KGBVలో కాంపౌండ్ వాల్ ఎక్కి పరార్:
ఈ ఘటన మరువక ముందే, వరంగల్ జిల్లా శాయంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో శుక్రవారం అర్ధరాత్రి మరో విస్తుపోయే సంఘటన జరిగింది. ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ కాంపౌండ్ వాల్ ఎక్కి బయటకు వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఆ తర్వాత పాఠశాల పరిసర ప్రాంతాల్లోనే వారిని సిబ్బంది గుర్తించారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేకే తాము బయటకు వచ్చినట్లు ఆ విద్యార్థినులు తెలిపారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం తిరిగి హాస్టల్‌కు పంపించారు.
భద్రతను పెంచాలని తల్లిదండ్రుల డిమాండ్:
ఈ వరుస ఘటనలతో రెసిడెన్షియల్ హాస్టళ్లలోని భద్రతా ఏర్పాట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ, హాస్టల్ యాజమాన్యాలు తక్షణమే స్పందించి సీసీటీవీ నిఘాను పటిష్టం చేయాలని, సందర్శకుల ప్రవేశాన్ని నియంత్రించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

