Breaking News

హైదరాబాద్‌లో మైనర్ ఘోర అపశ్రుతి: రెంటల్ కారుతో ఢీకొని ఒకరి బలి, మరొకరి పరిస్థితి విషమం!

హైదరాబాద్: రాజధాని నగరంలో మైనర్ల డ్రైవింగ్ మరో ప్రాణాన్ని బలిగొంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని 17 ఏళ్ల మైనర్ బాలుడు అద్దె కారును వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో 60 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన సోదరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన ఆదివారం ఉదయం మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్‌లో చోటుచేసుకుంది.

చర్చికి వెళ్తుండగా పగబడ్డ కాలం:

పోలీసుల కథనం ప్రకారం.. రాజ్‌కుమార్ (60), ఆయన సోదరుడు ఎమ్. ప్రభాకర్ (55) ఆదివారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై చర్చిలో ప్రార్థనకు వెళ్తున్నారు. కార్మికనగర్‌లోని ఒక పాఠశాల సమీపంలోకి రాగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన వైట్ కలర్ కారు (TS09 FK 4804) వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఎదురుగా వేగంగా వస్తున్న కారును చూసి బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డు ఎడమవైపునకు తిప్పినప్పటికీ, అదుపు తప్పిన కారు వారిని ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఆపై రోడ్డు పక్కన ఆపి ఉన్న మరికొన్ని ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి ఆగిపోయింది.

కారు కింద చిక్కుకున్న క్షతగాత్రులు:

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారు కింద ఇరుక్కుపోయిన ఇద్దరు సోదరులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను యూసుఫ్‌గూడలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌ను మరొక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని మధురానగర్ ఎస్‌హెచ్‌ఓ హెచ్. ప్రభాకర్ తెలిపారు.

ఫ్రెండ్స్ నిర్లక్ష్యం.. మైనర్ చేతికి తాళాలు:

పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బోరాబండలోని ఒక కాలేజీలో చదువుతున్న మైనర్ బాలుడి స్నేహితుడు ఎండీ నవాజ్ (19) శ్రీరామ్‌నగర్‌కు చెందిన అర్బాజ్ అనే వ్యక్తి వద్ద ఈ కారును అద్దెకు తీసుకున్నాడు. నవాజ్ కారును కార్మికనగర్ వరకు నడిపి, అక్కడ ఆపి మూత్ర విసర్జనకు వెళ్లాడు. ఆ సమయంలో నవాజ్ బావమరిది ఇమామ్ కారును రోడ్డు పక్కన నిలిపి, కీ (Key) ని ఇంజిన్ స్విచ్‌లోనే వదిలేసి వెళ్లాడు.

వెంటనే ఆ మైనర్ బాలుడు స్టారేజ్ స్విచ్ ఆన్ చేసి కారును ముందుకు తీశాడు. డ్రైవింగ్‌పై అదుపు లేకపోవడంతో వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లి బైక్‌పై వెళ్తున్న సోదరులను తీవ్రంగా ఢీకొట్టింది.

కేసు నమోదు – సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం:

పోలీసులు కారును సీజ్ చేసి, సదరు మైనర్ బాలుడి తండ్రికి సమాచారం అందించారు. మైనర్ బాలుడు మరియు కారు యజమానిపై సెక్షన్ 304-A కింద కేసు నమోదు చేశారు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్‌ను కోర్టు విచారణలో నిందితులకు శిక్ష పడేలా సాక్ష్యంగా ఉపయోగిస్తామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *