ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులా?.. మహిళలను ఈడ్చుకెళ్లడం దారుణమని మండిపాటు
జూలై 2: (E6 న్యూస్- శివ ఠాకూర్)
ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే వారిపై లాఠీచార్జీ చేసి, మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమకారులకు పెన్షన్లు, గుర్తింపు కార్డులు, 250 గజాల స్థలం, అమరవీరుల కుటుంబాలకు సహాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపించారు.
ఉద్యమకారులకు మద్దతుగా భూపోరాటంలో పాల్గొంటే మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేశారని తెలిపారు. మహిళలను ఈ విధంగా అరెస్టు చేయాలని ఏ పోలీస్ మాన్యువల్లో ఉందో ముఖ్యమంత్రి, మహిళా మంత్రులు, మంత్రివర్గం, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము శాంతియుతంగా సహకరిస్తామని చెప్పినా పోలీసులు వినకుండా అమానుషంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు కూడా లేకుండా చేయడం దురదృష్టకరమన్నారు.
ఉద్యమకారులపై లాఠీలు ఝుళిపిస్తుంటే ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉద్యమకారుల హక్కుల కోసం తమ పార్టీ పోరాటం ప్రారంభించిందని, వారికి న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలపై కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల అనుసరిస్తున్న వైఖరికి రాజకీయంగా తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

