నిజామాబాద్: వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ధర్నా చౌక్‌లో బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి భారీ ధర్నా చేపట్టారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో బ్యాంకింగ్ సిబ్బంది పాల్గొని తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేశారు.
పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించడానికి ఐదు రోజుల పని విధానం ఎంతో అవసరమని, అలాగే బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనతో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు నిలిచిపోయి పలు బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో అత్యవసర బ్యాంకింగ్ సేవల కోసం వచ్చిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.

