Breaking News

మంచిర్యాలలో ఉద్రిక్తత: గిరిజన యువకులపై FRO దాడి.. డిస్మిస్ చేయాలని ‘తుడుందెబ్బ’ డిమాండ్!

మంచిర్యాల: కవాళ్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలోని వాగులో చేపలు పడుతున్నారనే కారణంతో ఐదుగురు గిరిజన యువతపై ఇందన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) లక్ష్మీనారాయణ విచక్షణారహితంగా దాడి చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. దాడికి పాల్పడిన FRO లక్ష్మీనారాయణను తక్షణమే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని గిరిజన హక్కుల పోరాట సంస్థ ‘తుడుందెబ్బ’ డిమాండ్ చేసింది.

ప్రభుత్వం స్పందించకపోతే ముట్టడి తప్పదు!

ఈ ఘటనపై తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గొడెం గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన FROను విధుల నుంచి వెంటనే తొలగించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ అధికారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. త్వరలోనే ఇందన్‌పల్లి FRO కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రోడ్డెక్కిన గిరిజనులు – స్తంభించిన రవాణా:

యువకులపై దాడి మరియు వారిని అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు ఇందన్‌పల్లి గ్రామంలో రోడ్డుపై భైఠాయించి ‘రాస్తారోకో’ నిర్వహించారు. ఆగ్రహించిన నిరసనకారులు FRO కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసినట్లు తెలిసింది. అక్రమంగా నిర్బంధించిన అమాయక గిరిజన యువకులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసన కారణంగా జన్నారం – ఉట్నూర్ – నిర్మల్ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భారీగా బలగాలను మోహరించారు. అనంతరం ITDA-ఉట్నూర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) మంద మకరందు ఆందోళనకారులతో మాట్లాడి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు శాంతించి నిరసన విరమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *