Breaking News

ఎంపీ చామల బీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు

బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ‘మాక్ అసెంబ్లీ’పై భువనగిరి కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఒక రోజు ముందే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎల్పీ మీటింగ్ పెట్టి పోలీసులతో పంచాయతీ పెట్టుకుని రండని ఉసిగొల్పారని ఆరోపించారు.

శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే నైతికతను ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా కోల్పోయారని చామల విమర్శించారు. నల్ల టీషర్టులపై పేర్లు రాసుకుని సభకు వస్తే లోపలికి రానివ్వరని ముందే ఊహించి, గేటు వద్ద పోలీసులతో గొడవపడి డ్రామాలు ఆడారన్నారు. దళితులను, స్పీకర్‌ను బీఆర్‌ఎస్ నాయకులు దారుణంగా అవమానించారని మండిపడ్డారు.

మాక్ అసెంబ్లీ పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులపై వెకిలి చేష్టలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు తిట్టారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలపై చర్చించే ఆలోచన లేదని, అందుకే వారంతా ‘సురభి నాటక సమాజం’లో చేరడం మేలని ఎద్దేవా చేశారు. దసరా వస్తోంది కాబట్టి నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సులకు వారిని పంపాలని, వినాయక చవితి, దసరా, దీపావళి ఉత్సవాల్లో వారి అవసరం ఉందన్నారు. సంక్రాంతికి ఏపీకి డ్యాన్సుల కోసం పంపిస్తామని, ప్రజలు బీఆర్‌ఎస్ నాయకులను బఫూన్లలా చూస్తున్నారని చామల తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *