Breaking News

దర్శనానికి సిద్ధమైన 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి!

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణనాథుడు వినాయక చవితి ఉత్సవాలకు సంపూర్ణంగా సిద్ధమయ్యారు. ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తుతో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్నారు. విగ్రహ నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయని, ఆదివారం నాటికి భక్తుల దర్శనార్థం విగ్రహాన్ని అందుబాటులో ఉంచుతామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఛైర్మన్ రాజు కుమార్ (సింగరి రాజ్ కుమార్) వెల్లడించారు.

విగ్రహ తయారీలో భాగంగా మద్దతుగా వేసిన కర్రలను దశలవారీగా తొలగిస్తూ ముస్తాబు పూర్తి చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు తదితర 5 రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది నిపుణులైన శిల్పులు, కళాకారులు అహోరాత్రులు శ్రమించి ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారని నిర్వాహకులు తెలిపారు. తొలిరోజు జరిగే తొలి పూజకు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను ఉత్సవ సమితి ప్రత్యేకంగా ఆహ్వానించింది.

ఇటీవల నిర్వహించిన ‘ఆగమనం’ కార్యక్రమంలో దాదాపు 10 వేల మంది భక్తులు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. మహా గణపతికి కుడివైపున సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమవైపున కాళికామాత విగ్రహాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. తొమ్మిది లేదా పది రోజుల పాటు సాగే ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *