గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు గాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు సౌధాని భువనేశ్వర్ (భువన్న) యాదవ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది సర్పంచులు, కార్యదర్శులు ప్రజా భవన్కు తరలివచ్చి మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు పూలదండలు, శాలువాలు, బొకేలతో పాటు భారీ గజమాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఇంతకాలం గ్రామపంచాయతీల సొంత ఆదాయం అంతా ట్రెజరీకి వెళ్లడం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని సర్పంచులు తెలిపారు. ఇప్పుడు పంచాయతీల సొంత ఆదాయాన్ని నేరుగా వాటి సొంత ఖాతాల్లోనే జమ చేసుకునేలా చట్టసవరణ తీసుకురావడంలో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు. ఈ అసెంబ్లీ చట్టసవరణ ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా కృషి చేసినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్పేలా సొంత నిధుల వినియోగానికి సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సర్పంచుల సంఘం నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు.

