మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివరణ ఇచ్చారు. ఒకరి మరణాన్ని లేదా చావును కోరుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే మహిళా మంత్రులపై బీఆర్‌ఎస్ నాయకులు వాడుతున్న అసభ్యకర, కుల ఆధారిత పదజాలాన్ని శంకర్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశించి నీచమైన భాష మాట్లాడటం దారుణమన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు రాజ్యాంగ పదవులను అవమానిస్తుంటే తట్టుకోలేక, కడుపు మండి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని కోరినట్లు తెలిపారు.
తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలదని, అది ఏ ఒక్క కుటుంబానికీ చెందినది కాదని స్పష్టం చేశారు. గతంలో కరీంనగర్ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పులను ఈ సందర్భంగా ఆయన మీడియాకు ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడిపైనే అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు ఆత్మసంయమనం పాటించాలని, వ్యక్తిగత, అసభ్యకర దూషణలకు దిగవద్దని హితవు పలికారు.

