ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్ నగర్లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు చొరబాటుదారులతో సహా మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల వివరాలు:
- మహ్మద్ జౌనీ అలీ అలియాస్ జానీ అలీ (30) – బంగ్లాదేశ్ నివాసి (ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంటున్నాడు).
- మహ్మద్ రుమాన్ అలీ (33) – బంగ్లాదేశ్ నివాసి.
- తరుణ్ సింగ్ (29) – భోపాల్ (మధ్యప్రదేశ్) నివాసి.
కుక్కర్లు అమ్ముతూ రెక్కీ.. రాత్రి వేళల్లో చోరీలు!
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడు జౌనీ అలీ 2015 నుండి భారతదేశంలోకి అక్రమంగా చొరబడి నకిలీ ఆధార్ కార్డు పొందినట్లు తెలిపారు. పగటిపూట ప్రెజర్ కుక్కర్లు, గ్రైండర్లు అమ్ముకునే వ్యాపారులుగా నటిస్తూ నివాస ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించేవారని, రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవారని వివరించారు.
జూలై 11న బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన జౌనీ అలీ, తన ముఠాతో కలిసి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా ఆదిలాబాద్ చేరుకున్నాడు. కైలాష్ నగర్లో చోరీకి పాల్పడిన అనంతరం పరారవుతుండగా సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వారిని పట్టుకున్నారు.
10-12 సార్లు అక్రమ చొరబాట్లు.. రూ. 8 లక్షల సొత్తు స్వాధీనం:
నిందితుడు జౌనీ అలీకి రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోరీ కేసులు, బైక్ దొంగతనాలతో సంబంధం ఉంది. ఇప్పటివరకు 10 నుండి 12 సార్లు భారత్‌లోకి అక్రమంగా వచ్చి చోరీలు చేసి, ఆపై పోలీసులకు చిక్కకుండా తిరిగి బంగ్లాదేశ్ పారిపోతుండేవాడని విచారణలో తేలింది. ఈయన వెనుక మరో 12 నుండి 15 మందితో కూడిన పెద్ద బంగ్లాదేశీ నెట్వర్క్ పనిచేస్తోందని ఎస్పీ తెలిపారు.
నిందితుల వద్ద నుండి 73.05 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి వస్తువులు, రూ. 4,270 నగదు, 7 మొబైల్ ఫోన్లు, ఒక ఐప్యాడ్ మరియు ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని అంచనా. కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

