హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్లోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పరస్పర ఘర్షణకు దారితీశాయి. రెండు పార్టీల శ్రేణులు ఎదురెదురుగా నినాదాలు చేయడంతో పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఏర్పడగా, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
గాంధీ భవన్ వైపు బీజేపీ ర్యాలీ
ఢిల్లీలో ‘సిజెపి’ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు నాంపల్లిలోని గాంధీ భవన్ నుంచి సోమాజిగూడలోని లోక్ భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మరోవైపు, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఇతరులు చేపట్టిన నిరసనలను ఖండిస్తూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి గాంధీ భవన్ వైపు పోటీ ర్యాలీ నిర్వహించారు.
గాంధీ భవన్ వద్ద లాఠీఛార్జ్, నేతల ముందస్తు అరెస్టులు
రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని ఒకరికొకరు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేసుకోవడంతో నాంపల్లి పరిసరాల్లో వాతావరణం వేడెక్కింది. గాంధీ భవన్ ప్రాంగణంలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పలువురు కీలక నేతలను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

