Breaking News

బీసీల ఆత్మగౌరవం పెంచేలా చంద్రబాబు పాలన

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం


బీసీ రక్షణ చట్టానికి తుదిమెరుగులు దిద్దుతున్నాం: మంత్రి సవిత

విజయవాడ, సెప్టెంబర్ 12:(E6tv NEWS ప్రతినిధి).

బీసీల ఆత్మగౌరవం పెంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. శనివారం విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో బీసీ రక్షణ చట్టంపై వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లతో నిర్వహించిన అవగాహన, సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు.

బీసీల రక్షణ, ఆత్మగౌరవం కోసం బీసీ రక్షణ చట్టాన్ని రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. చట్టం కోర్టుల్లోనూ బలంగా నిలిచేలా తుదిమెరుగులు దిద్దుతున్నామని చెప్పారు. బీసీలను కులం, వృత్తుల పేరుతో దూషించడం, సంఘ బహిష్కరణలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షించేలా నిబంధనలు రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, కేసుల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.రాష్ట్రంలోని 156 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ల నుంచి బీసీ రక్షణ చట్టంపై అభిప్రాయాలు సేకరించామని మంత్రి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీ రక్షణ చట్టం అమలుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని మంత్రి సవిత స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని విమర్శించారు. మరోసారి 34 శాతం రిజర్వేషన్ల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

90 శాతం హామీలు అమలు

కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు అమరావతి, పోలవరం, రహదారులు, పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. త్వరలో ఆదరణ–3.0 కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మరోసారి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు సూచించారు.

ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణతో పాటు వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సవితను కార్పొరేషన్ చైర్మన్లు ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎన్టీఆర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *