ఏర్గట్ల, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).
ఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు మొత్తం 1,419 నూతన రేషన్ కార్డులు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వీటి ద్వారా సుమారు 4,200 కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
మండలంలోని ఏర్గట్లకు 550, దోంచందకు 75, గుమ్మిర్యాల్కు 150, తడపకల్కు 190, బట్టాపూర్కు 132, తోర్తికి 150, తాళ్లరాంపూర్కు 132, నాగేంద్రనగర్కు 40 కార్డులు మంజూరైనట్లు తెలిపారు. అదేవిధంగా పాత రేషన్ కార్డుల్లో సుమారు 1,500 మంది కుటుంబ సభ్యులను కొత్తగా జత చేసినట్లు వెల్లడించారు. దీంతో మండల పరిధిలో అదనంగా సుమారు 306.16 క్వింటాళ్ల బియ్యం లబ్ధిదారులకు అందనున్నట్లు తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఖర్చు లేకుండా మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు అందిస్తున్న ఘనత ప్రజాపాలన ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్న వారు మీ-సేవలో దరఖాస్తు చేసుకుంటే కార్డులు మంజూరవుతాయని తెలిపారు.
నూతన డిజిటల్ రేషన్ స్మార్ట్ కార్డు కుటుంబ గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందని, దీని ద్వారా సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
401 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
మండలానికి తొలి విడతలో 401 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 313 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. లబ్ధిదారులకు నిధులు కూడా అందజేసినట్లు పేర్కొన్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి లేని లబ్ధిదారులను తొలగించి, వారి స్థానంలో మరో 88 ఇళ్లను కొత్తగా మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చని సూచించారు.రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులు లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేసి పంపించారని, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సునీల్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సహకారంతో ఆమోదం ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు.
ఇళ్లు లేని అర్హులు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో గ్రామపంచాయతీ లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేసి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
ఎస్ఐఆర్పై కాంగ్రెస్ నాయకులకు సూచనలు
ఎస్ఐఆర్ రెండో విడతలో భాగంగా ఓటర్లకు నోటీసులు అందుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు ప్రత్యేక దృష్టి సారించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ సూచించారు. బీఎల్ఓల ద్వారా ఓటర్లకు అందుతున్న నోటీసులను పరిశీలించి, అవసరమైన ఆధారాలు సమర్పించేలా సహకరించి అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉందన్నారు.రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, కేఎంసీ డైరెక్టర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

