హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏవిస్ హాస్పిటల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) సమస్యకు శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ.. సర్జరీ జరిగిన మరుసటి రోజే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది.
కుషాయిగూడ రాంపల్లికి చెందిన మంజుల అనే మహిళ వెరికోస్ వెయిన్స్ చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని ఏవిస్ హాస్పిటల్‌లో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స పూర్తయిన మరుసటి రోజే పరిస్థితి విషమించి మృతి చెందారు. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం వల్లే మంజుల మరణించిందని, సరైన వైద్యం అందించడంలో ఆస్పత్రి సిబ్బంది విఫలమయ్యారని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
మహిళ మృతికి అసలు కారణాలపై ఆస్పత్రి యాజమాన్యం సరైన సమాధానం చెప్పడం లేదని బాధితులు మండిపడుతున్నారు. ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు వచ్చిన మీడియాను కూడా ఆస్పత్రి లోపలికి అనుమతించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతురాలికి 9 ఏళ్ల చిన్నారి కుమార్తె ఉందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసులు స్పందించి సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

