ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని మండిపడిన ఆమె, ఈ నెల 20న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించి ఆయన అవినీతి పాపాల చిట్టాను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డిని ‘బ్లాక్‌మెయిలర్ల సంఘానికి అధ్యక్షుడు’గా అభివర్ణించిన కవిత, గతంలో ఆర్టీఐ చట్టాన్ని ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన ఆయన, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తన కుటుంబ సభ్యులు, మంత్రులు, మిత్రులతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ పాత్రను తలపిస్తోందని ఎద్దేవా చేశారు.
సిద్దిపేటలో నిషేధిత జాబితాలో ఉన్న వంద ఎకరాల భూమిని మాజీ మంత్రి హరీశ్‌రావు కుటుంబ సభ్యుల పేర్లకు బదలాయించారనే వ్యవహారంపై స్పందిస్తూ.. దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ధైర్యముంటే తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు.
అదే సమయంలో ప్రతిపక్ష బిఆర్ఎస్ (BRS) వైఖరిని కూడా కవిత తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడకుండా అధికార, ప్రతిపక్షాలు పరస్పరం నిందించుకోవడానికే సమయం కేటాయిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, కొడంగల్ సభ వేదికగా ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తామని తేల్చి చెప్పారు.

