మఠంపల్లి, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి)
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కృష్ణానదిపై మట్టపల్లి బ్రిడ్జి వద్ద సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం హుజూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గజ్జె చరమంద రాజు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం అధికారులు మట్టపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేయనున్న నిమజ్జన ఘాట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ సూచించారు.
నిమజ్జన ప్రదేశంలో భారీ లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని సూచించారు. నదిలో ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ నెట్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తుల కోసం తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, సాఫీగా జరిగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎన్సీఎల్, సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలకు సీఐ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మఠంపల్లి మండల తహసీల్దార్, ఎంపీడీవో, ట్రాన్స్‌కో ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ, ఫైర్ ఆఫీసర్, స్థానిక సర్పంచ్, ఎన్సీఎల్ ఫ్యాక్టరీ ప్రతినిధులు, మఠంపల్లి ఎస్సై బి. ప్రవీణ్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

