హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం అమెరికాలోని కాలిఫోర్నియా (శాన్ హోసే)లో ఉన్న ప్రముఖ బ్యాటరీ సాంకేతిక సంస్థ ‘క్వాంటమ్స్కేప్’ (QuantumScape) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తదుపరి తరం ‘సాలిడ్-స్టేట్ లిథియం-మెటల్’ బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధితో పాటు, భారత అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి మధ్య ఉండే భాగస్వామ్య అవకాశాలపై ఆయన క్వాంటమ్స్కేప్ ప్రెసిడెంట్ & సీఈఓ డాక్టర్ శివ శివరామ్, ఇతర సీనియర్ మేనేజ్మెంట్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు.
సమీక్ష సందర్భంగా, సంప్రదాయ లిథియం-అయాన్ కణాలతో పోలిస్తే అధిక శక్తి సామర్థ్యం (Higher energy density), వేగవంతమైన ఛార్జింగ్ మరియు మెరుగైన భద్రతను అందించే సాలిడ్-స్టేట్ బ్యాటరీలపై క్వాంటమ్స్కేప్ చేపడుతున్న పరిశోధనలను డాక్టర్ శివ శివరామ్ డిప్యూటీ సీఎంకు వివరించారు.
ప్రధాన చర్చనీయాంశాలు:
- గ్లోబల్ బ్యాటరీ సప్లై చైన్: కీలక ఖనిజాలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, సెల్ తయారీ మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) వీటిని అనుసంధానించే విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు.
- భారత్లో విస్తరణ అవకాశాలు: ఇంజనీరింగ్ R&D, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సరఫరా, సప్లై చైన్ భాగస్వామ్యాలు మరియు భవిష్యత్తులో నెక్స్ట్-జెన్ బ్యాటరీ సాంకేతికతను భారత్లో తయారు చేసే ఆస్కారాలపై ఇరు వర్గాలు ఆలోచనలు పంచుకున్నాయి.
- తెలంగాణ పెట్టుబడులకు ఆహ్వానం: భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం, అడ్వాన్స్డ్ తయారీ సామర్థ్యాన్ని వివరించిన భట్టి విక్రమార్క.. తెలంగాణలోని అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక, ఆవిష్కరణ కారిడార్లలో (Innovation Corridors) భాగస్వామి కావాల్సిందిగా క్వాంటమ్స్కేప్ ప్రతినిధులను ఆహ్వానించారు.

