Breaking News

గణేష్ ఉత్సవ నిర్వాహకులకు ఉచిత విద్యుత్…సీఎం రేవంత్

హైదరాబాద్ మహా నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ మరియు నిమజ్జన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్‌లతో పాటు జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీస్ ఉన్నతాధికారులు మరియు గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత సంప్రదాయాలను పునర్దుద్ధరిస్తూ నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఈ సౌకర్యాన్ని పొందాలని కోరారు.

మండపాల ఏర్పాటు ప్రదేశాలు, అలాగే ముఖ్య అతిథులను ఆహ్వానించే వివరాలను ముందే స్థానిక పోలీస్ కమిషనరేట్‌కు తెలియజేస్తే ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణ సులభమవుతుందని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే చెరువుల వద్ద క్రేన్ల ఏర్పాటు, బతుకమ్మ మరియు నిమజ్జనాలకు అనుగుణంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని, ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *