గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములను ఆక్రమించిందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శాసనసభలో 22-ఏ నిషేధిత భూములపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రజల భూములు మరియు ఆస్తులకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ రెవెన్యూ సంస్కరణల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ రెవెన్యూ శాఖను తన వద్దే ఉంచుకుని భారీ భూ అక్రమాలకు పాల్పడ్డారని పొంగులేటి విమర్శించారు. రాష్ట్రంలోని 2.49 కోట్ల ఎకరాల భూమిని తమ సొంత ఆస్తిగా భావించి గత పాలకుల కుటుంబం అక్రమాలకు పాల్పడిందని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ నిర్వహణను దివాలా తీసిన ఒక విదేశీ కంపెనీకి అప్పగించి, అర్ధరాత్రి వేళల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు.
పోర్టల్‌లోని తీవ్ర సాంకేతిక లోపాల వల్ల లక్షలాది మంది రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని, మనస్తాపానికి గురై వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, వారి బంధువులు మాత్రమే లబ్ధి పొందారని ఎద్దేవా చేశారు. సభ సాక్షిగా తమ అక్రమాల బండారం బయటపడుతుండటంతోనే బీఆర్ఎస్ నేతలు చర్చ నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు.

