Breaking News

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్ / మధిర: సంక్షేమ పథకాలు ‘ఉచితాలు’ (Freebies) కావు.. అవి ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మధిర నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను (Centralized Community Kitchen) సోమవారం ఆయన ప్రారంభించారు.

పరిశ్రమలు, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించినట్లే.. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక పురోగతి కోసం ప్రభుత్వం చేసే వ్యయం పెట్టుబడేనని, పూర్తి అవగాహన లేని వారే సంక్షేమాన్ని ఉచితాలని విమర్శిస్తారని దుయ్యబట్టారు.

‘ఉచిత ఉదయం అల్పాహార పథకం’ ముఖ్యాంశాలు:

  • 27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 20 లక్షల మంది విద్యార్థులతో పాటు వసతి గృహాల్లోని (రైసిడెన్షియల్) 7 లక్షల మంది విద్యార్థులు.. మొత్తం 27 లక్షల మందికి ప్రతిరోజూ ఉదయం వేడివేడి అల్పాహారం అందించే చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు.
  • హరే కృష్ణ మిషన్‌తో భాగస్వామ్యం: అత్యంత ఆధునిక, పరిశుభ్రమైన వంటశాలల ద్వారా అల్పాహారం అందించేందుకు హరే కృష్ణ మువ్మెంట్ (Hare Krishna Mission)తో ప్రభుత్వం చేతులు కలిపింది. రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా శాశ్వత సెంట్రలైజ్డ్ కిచెన్ల నిర్మాణం పూర్తి కానుంది.
  • పోషకాహారం: టిఫిన్‌తో పాటు వారానికి మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావను విద్యార్థులకు అందించనున్నారు.
  • మధిర నుంచి ప్రారంభం: తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కిచెన్ ద్వారా ప్రస్తుతం మధిర నియోజకవర్గంలోని 16 మండలాల పరిధిలోని పాఠశాలలకు అల్పాహారాన్ని పంపిణీ చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం ఉద్వేగభరిత ప్రసంగం:

“ఆకలి కడుపుతో పాఠశాలకు వచ్చే పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. తెలంగాణలో ఏ ఒక్క చిన్నారి కూడా ఆకలితో బడికి వెళ్లకూడదన్నదే మా ఇందిరమ్మ రాజ్య ముఖ్య ఉద్దేశం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ పథకాన్ని ప్రారంభించాం.”

“అదిలాబాద్ నుండి ఖమ్మం వరకు నేను చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో పేదల కష్టాలు, బడుల దుస్థితిని స్వయంగా చూశాను. ఆ యాత్రలో నా మనస్సులో మెదిలిన ఆలోచనలనే ఈరోజు ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలుగా అమలు చేస్తున్నాం. పిల్లలతో కలసి భోజనం చేయడం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన క్షణం.”

మానవ వనరులే రాష్ట్రానికి అసలైన సంపద అని, మన పిల్లలను ప్రపంచస్థాయి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *