Breaking News

యోగ సేవలకు గుమలాపురం సత్యనారాయణకు సన్మానం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేత

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).

యోగ రంగంలో విశేష సేవలు అందిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి, పట్టణ ప్రముఖ యోగా గురువు గుమలాపురం సత్యనారాయణను కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. తెలంగాణ యోగ టీచర్స్ కోఆర్డినేట్ కమిటీ (TYTCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సన్మానం జరిగింది.యోగ ద్వారా ప్రజలకు ఆరోగ్యం, ఆనందంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సత్యనారాయణ చేస్తున్న సేవలను మంత్రి కిషన్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

అనంతరం TYTCC ప్రతినిధులు యోగాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్పొరేట్ పరిశ్రమల్లో యోగా శిక్షణలు తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా విద్య అందించాలని కోరారు. ఆయుష్ విభాగంలో యోగా ఉపాధ్యాయుల గౌరవ వేతనాలు పెంచడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే రాష్ట్రంలోని 794 పీఎం శ్రీ పాఠశాలల్లో యోగా ఉపాధ్యాయులను నియమించి గౌరవ వేతనాలు అందించాలని, యోగా అభివృద్ధి కోసం తెలంగాణలో ప్రత్యేకంగా యోగా భవన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యఅతిథిగా తీసుకురావడానికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో TYTCC కన్వీనర్ సత్యారెడ్డి, TYA రాష్ట్ర అధ్యక్షుడు బ్రిడ్జిభూషణ్, పతంజలి యోగ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రావు, కృపాకర్‌రావు, రవి, సత్యం జీ, ఆల్ ఇండియా యోగ కల్చరల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *