హైదరాబాద్ :
నీట్-యుజి (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారం, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్, మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీల అమలులో ఆలస్యంపై తెలంగాణలో నిరసన జ్వాలలు విరుచుకుపడ్డాయి. శుక్రవారం (రేపు) రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా, నిరుద్యోగ యువత మరియు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) భారీ నిరసనలకు సిద్ధమయ్యాయి.
వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ పిలుపు – ప్రధాన డిమాండ్లు:
ఢిల్లీలో ‘సంసద్ చలో’ ర్యాలీపై జరిగిన అణచివేతకు నిరసనగా SFI, AISF, PDSU వంటి విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. వీరి ప్రధాన డిమాండ్లు:
- నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని వెంటనే రద్దు చేయాలి.
- ప్రతిపాదిత ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025’ను ఉపసంహరించుకోవాలి.
ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ పోరు – కేటీఆర్ పాల్గొననున్న భారీ ధర్నా
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరగబోయే బిఆర్ఎస్వి (BRSV) నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు పాల్గొననున్నారు.
కేటీఆర్ ట్వీట్:
“బలప్రయోగంతో దేశ యువత గొంతును నొక్కలేరు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన విచక్షణారహిత దాడికి నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద BRSV నిర్వహించే ధర్నాలో పాల్గొంటున్నాను. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతున్నాను,” అని KTR పిలుపునిచ్చారు.
నిరుద్యోగ జేఏసీ, పోలీసు అభ్యర్థుల ఆందోళన
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని వెంటనే నెరవేర్చాలని కోరుతూ నిరుద్యోగులు కూడా రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
అలాగే, పోలీస్ అభ్యర్థుల జేఏసీ వివాదాస్పద జీవో నంబర్ 46 (GO 46)ను రద్దు చేయాలని, పోలీస్ నియామకాల్లో ఖాళీల సంఖ్యను పెంచి, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్ట్ాలని డిమాండ్ చేస్తోంది. శుక్రవారం నాటి ఈ బంద్, ధర్నాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

