హైదరాబాద్: పూజా గదుల్లో ఉండే పాతబడిన లేదా విరిగిపోయిన దేవుళ్ల చిత్రపటాలు, విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ పడేసి దైవాపచారం జరగకుండా చూసేందుకు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) నడుంబిగించింది. ‘లూప్ సస్టైనబిలిటీ’ స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా పాత విగ్రహాలను, దేవుడి పటాలను సేకరించి, అత్యంత గౌరవప్రదంగా నిమజ్జనం లేదా పునర్వినియోగం చేస్తారు.
ఈ గురువారం ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించిన మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, ప్రజలు తమ ఇళ్లలోని పాత లేదా దెబ్బతిన్న విగ్రహాలను రోడ్లపక్కన, చెట్ల కింద పడేయకుండా కేటాయించిన ఆలయాల్లో అప్పగించాలని కోరారు.
జూలై 25 నుంచి మొదటి విడత – విగ్రహాల సేకరణ కేంద్రాలు ఇవే:
- మల్కాజ్‌గిరి జోన్: వినాయక్ నగర్, కళ్యాణ్ భారతి ఎన్‌క్లేవ్‌లోని నల్ల పోచమ్మ-ముత్యాలమ్మ-మహంకాళి (త్రిపుర సుందరి) దేవాలయం.
- ఉప్పల్ జోన్: స్వరూప్ నగర్ రోడ్, అమృత కాలనీలోని శ్రీ మాలిని కరిగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయం.
- ఎల్బీ నగర్ జోన్: చంపాపేట్ విరాట్ నగర్‌లోని ప్రముఖ శ్రీ కర్మాన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం.
పౌరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, భక్తిశ్రద్ధలతో దేవుళ్ల చిత్రపటాలను, విగ్రహాలను కేటాయించిన కేంద్రాల్లో అందజేసి నగర పరిశుభ్రతకు, దైవ గౌరవానికి సహకరించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

