మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో తెలంగాణ రాజకీయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి హుటాహుటిన ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు అందింది. వెంటనే బయలుదేరి రావాలని పార్టీ పెద్దల నుంచి ఆమెకు స్పష్టమైన సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన అనంతరం కొండా సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్న తరుణంలో, శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమెతో స్వయంగా ఫోన్ లో మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, అధిష్ఠానం పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బిసి సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత అయిన కొండా సురేఖను బుజ్జగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆమెకు కేబినెట్ హోదా కలిగిన కీలక పదవిని అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కొండా సురేఖ ఢిల్లీ పర్యటన పూర్తయిన తర్వాత ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

