Breaking News

ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల వివాదం… ఏబీవీపీ ఆందోళన, ఎం ఈ ఓ విచారణ.

  • పాఠశాలలోనే పుస్తకాల విక్రయమంటూ ఏబీవీపీ ఆరోపణలు
  • పేద విద్యార్థులకు ఉచిత పంపిణీ కోసమే బుక్స్ ఉంచామని యాజమాన్యం వివరణ
  • ఇరు వర్గాల వాదనలు విన్న ఎంఈఓ.. పాఠశాలకు నోటీసు జారీ

చందూరు, జూలై 2:(E6 న్యూస్- ఔరాద్ అశోక్)
నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల నిల్వ, విక్రయాల అంశం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలోనే పుస్తకాలను విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం పాఠశాలకు వెళ్లి నిరసన తెలిపారు.

విద్యార్థి సంఘ నాయకుల కథనం ప్రకారం, పాఠశాలలోని ఓ గదిలో పెద్ద మొత్తంలో పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఆర్పీని పంపినట్లు తెలిపారు. అనంతరం బుధవారం ఎంఈఓ స్వయంగా పాఠశాలను సందర్శించి గదిని పరిశీలించారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ లేరని, తాళం చెవి లేదని చెప్పిన సిబ్బంది అధికారులు వచ్చిన వెంటనే గది తాళం తీసి చూపించడం అనుమానాలకు తావిస్తోందని ఏబీవీపీ నాయకులు విమర్శించారు. పాఠశాలలో పుస్తకాల విక్రయాన్ని వెంటనే నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

అయితే, విద్యార్థి సంఘ నాయకులు అనుమతి లేకుండా పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించడం వల్ల విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారని పాఠశాల సిబ్బంది ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. చైర్మన్ లేని సమయంలో పాఠశాలలోకి చొరబడడం సరైంది కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని, అందులో భాగంగా 40 మంది పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడానికి మాత్రమే పాఠ్యపుస్తకాలను గదిలో నిల్వ ఉంచామని పాఠశాల యాజమాన్యం ఎంఈఓకు వివరణ ఇచ్చింది.

ఇరు వర్గాల వాదనలు విన్న ఎంఈఓ, పాఠశాల యాజమాన్యానికి నోటీసు జారీ చేసి పూర్తి వివరణ సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.

మొత్తంగా ఈ ఘటన చందూరు మండలంలో చర్చనీయాంశంగా మారగా, ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయాలపై విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *