Breaking News

శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ చోరీ కేసును చేదించిన పోలీసులు.

10 రోజుల్లోనే నిందితుల అరెస్ట్ – వెండి ఆభరణాల స్వాధీనం

బాసర, జూలై 2: E6 న్యూస్ తిరుపతి గౌడ్

నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం పది రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు.

ఆలయంలో చోరీ జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాల సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

దర్యాప్తులో పల్లపు ఏడుకొండలు, గైని రామకృష్ణ, కొడమ ఆనంద్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. వీరు పాత నేరస్తులని, రైల్వే సౌకర్యం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడటం వీరి నేరశైలి అని ఎస్పీ వెల్లడించారు.

నిందితుల వద్ద నుంచి 1.220 కిలోల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టీలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన వెండి వస్తువులను విక్రయించేందుకు రైలులో నాందేడ్ వెళ్తుండగా బాసర రైల్వే స్టేషన్‌లో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

కేసును అత్యంత వేగంగా, సమర్థవంతంగా ఛేదించిన దర్యాప్తు బృందంలోని పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *