వారం రోజుల్లో ఇండోర్ స్టేడియం ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ.
నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ ప్రతినిధి (శివ ఠాకూర్)
నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా ఒలింపిక్ సంఘం ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై వెంటనే స్పందించి ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య మాట్లాడుతూ, కోచ్‌లు, ఆధునిక క్రీడా మైదానాలు వంటి మౌలిక వసతులు లేకపోయినా జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
దీనిపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర క్రీడల మంత్రితో ఫోన్‌లో మాట్లాడి నిజామాబాద్ జిల్లాలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. రూ.5 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ప్రకటన అనంతరం జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు భక్తవత్సలం, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, రాజ గౌడ్, జావిద్, నాంచారి శీను, వాసు తదితరులు మహేష్ కుమార్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లాలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఇండోర్ స్టేడియం ఏర్పాటు కీలక మైలురాయిగా నిలుస్తుందని జిల్లా ఒలింపిక్ సంఘ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

