“వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం – అభివృద్ధిపై చర్చకు సిద్ధం: బీజేపీ నాయకులు”
ఆర్మూర్, జూలై 4:E6 న్యూస్ (శివ ఠాకూర్).
ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు.
ఎమ్మెల్యేపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని, అవసరమైతే సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడితే సహించేది లేదని, రాజకీయ విమర్శలు హద్దులు దాటితే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ నిధులు, సీఎం సహాయనిధి వంటి అంశాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన జీవన్ రెడ్డి హాస్టళ్ల దుస్థితి వంటి సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.
ఓబీసీ నాయకుడు యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ ప్రజల తీర్పుతో భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే బదులు ప్రజా సమస్యలపై పోరాడాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ పీసీసీ నాయకత్వం దృష్టిలో పడేందుకే ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, కమిషన్లు, బెదిరింపుల రాజకీయాలను విడనాడాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు బొట్టు రాజు, శ్రావణ్, అరుణ్, ఈశ్వర్, శ్రీనివాస్, బీజేపీ యువమోర్చా పట్టణ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్, పులి యుగేందర్, మామిడిపల్లి అరుణ్, జెస్సు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

