దేశవ్యాప్తంగా ఎల్-నినో తరహా ప్రభావం
బలహీనంగా రుతుపవనాలు.. పెరుగుతున్న వర్షపాతం లోటు
జూలై చివరికి దేశ వర్షపాతం లోటు 20 నుంచి 25 శాతానికి చేరే అవకాశం
చివరి పది రోజుల్లో వర్షాలు కురవకపోతే.. ఆగస్టుపైనే ఆశలు
స్పెషల్ స్టోరీ:
నిజామాబాద్ జులై 11: (E6 న్యూస్) శివ ఠాకూర్
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు పడటం లేదన్న ప్రశ్న ప్రస్తుతం రైతులతో పాటు సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే రుతుపవనాల గమనం, వాతావరణ వ్యవస్థల ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. ఎల్-నినో తరహా ప్రభావం దేశంలోని అనేక ప్రాంతాలపై కనిపిస్తున్నట్లు వాతావరణ విశ్లేషణలు సూచిస్తున్నాయి.
మహారాష్ట్రలోని కొంకణ్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో మాత్రమే ఇప్పటివరకు మంచి వర్షాలు నమోదయ్యాయి. అదే రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాలు మాత్రం వర్షపాతం లోటును ఎదుర్కొంటున్నాయి. జూలై రెండో భాగంలో ఈ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రం కావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో విస్తృతంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు పరిమితంగానే ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి.
ఉత్తరం వైపు రుతుపవన ద్రోణి
ప్రస్తుతం రుతుపవన ద్రోణి ఉత్తరం వైపు కొనసాగుతుండటం తెలంగాణతో పాటు మధ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో వర్షాలపై ప్రభావం చూపుతోంది. దీనికితోడు MISO ఫేజ్ 6-7-8 పరిస్థితులు ఎల్-నినో తరహా వాతావరణ ప్రవర్తనను పోలి ఉండటంతో వర్షపాతం పంపిణీలో తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో తూర్పు భారతదేశంలోని ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే మంచి వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాలు బలహీన రుతుపవనాల ప్రభావాన్ని ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.
దేశంలో 14 శాతం వర్షపాతం లోటు!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 14 శాతం లోటు ఉన్నట్లు అంచనా. జూలై రెండో భాగంలో కొన్ని వాతావరణ వ్యవస్థలు ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ బలహీన రుతుపవన పరిస్థితులు కొనసాగితే జూలై చివరి నాటికి దేశ వర్షపాతం లోటు 20 నుంచి 25 శాతానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణకు చివరి పది రోజులే ఆశ!
తెలంగాణ విషయానికి వస్తే జూలై చివరి పది రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ సమయంలో అనుకూల వాతావరణ వ్యవస్థలు ఏర్పడి విస్తారంగా వర్షాలు కురిస్తే రాష్ట్రంలో నెలకొన్న వర్షపాతం లోటు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
అయితే జూలై చివరి పది రోజుల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే.. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆగస్టు నెలలో కురిసే వర్షాలపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
మొత్తంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలను చూసి దేశమంతటా రుతుపవనాలు బలంగా ఉన్నాయని భావించడం సరికాదని వాతావరణ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వర్షపాతం ప్రాంతాల వారీగా తీవ్ర వ్యత్యాసాలతో నమోదవుతుండగా.. తెలంగాణకు మాత్రం ‘జూలై చివరి పది రోజులు’ వరుణుడి కరుణ కోసం కీలక నిరీక్షణగా మారాయి.

