ప్రేమ మోసాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
బిక్కనూర్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు బిక్నూర్ సబ్‌ఇన్‌స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్ ప్రమాదాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించింది.
సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితరాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని, చదువుపైనే దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చిన్న పొరపాటు కూడా జీవితాన్ని దెబ్బతీసే అవకాశముందని, తల్లిదండ్రులు, అధ్యాపకుల సూచనలు పాటించాలని విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930, మాదకద్రవ్యాల సమాచారానికి 1908, షీ టీమ్ సహాయం కోసం 8712686094, అత్యవసర పరిస్థితుల్లో 100/112 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషరావు, పోలీస్ కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాత్మక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. మానవ అక్రమ రవాణా నియంత్రణపై కానిస్టేబుల్ రాజేందర్ అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మణి రాధాదేవి, కళాశాల మోటివేటర్, ఫిజికల్ డైరెక్టర్ మురళీమోహన్, అధ్యాపక బృందం, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, బ్లూ కోట్స్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

