Breaking News

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలి

డీఈవో అశోక్‌కు ప్రెస్ క్లబ్ వినతి – సానుకూల స్పందన

ఒకటి, రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ

నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్
అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 100 శాతం ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి వాగ్మారే సుభాష్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణికి కూడా ఇదే అంశంపై ప్రెస్ క్లబ్ ప్రతినిధులు వినతి అందజేయగా, ఆమె జిల్లా విద్యాశాఖ అధికారికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం సెలవు ముగించుకుని విధుల్లో చేరిన డీఈవో అశోక్‌ను మరోసారి కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేశారు.

వినతిపై స్పందించిన డీఈవో అశోక్ మాట్లాడుతూ, ఇతర జిల్లాల్లో అమలులో ఉన్న విధానాలను పరిశీలించి, నిజామాబాద్ జిల్లాలో కూడా అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.

డీఈవో సానుకూల స్పందనపై ప్రెస్ క్లబ్ కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు సతీష్, కమిటీ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *