ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి : ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి
ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం.. రూ.5 వేల నగదు ప్రోత్సాహకం
నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడంతో పాటు విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపర్చాలని సూచించారు.
ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, నాణ్యమైన పౌష్టికాహారం, క్రమశిక్షణ, నైతిక విలువలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపులో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 21 శాతం అధికంగా ప్రవేశాలు నమోదయ్యాయని, నెలాఖరులోపు లక్ష్యాన్ని సాధించేలా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రతి పాఠశాలలో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్సెస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి తన తరఫున ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులను సన్మానించారు.

