రాజీవ్ గాంధీ ఆడిటోరియం, లింబాద్రి గుట్ట, సిద్ధుల గుట్ట అభివృద్ధికి నిధుల మంజూరు
నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు వెల్లడించింది.
నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల కోసం రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆడిటోరియాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపింది.అలాగే బాల్కొండ నియోజకవర్గంలోని ప్రసిద్ధ లింబాద్రి గుట్ట వద్ద టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయని పేర్కొంది. ఈ ప్రాజెక్టుతో ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది.ఆర్మూర్‌లోని సిద్ధుల గుట్ట వద్ద టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయని తెలిపింది. దీంతో పర్యాటకులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది.
ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇంచార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి కొనసాగుతుందని పార్టీ నాయకులు తెలిపారు.

