రైతులకు శాశ్వత సాగునీరే లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన అసలు డిజైన్ ఆధారంగానే పూర్తి చేసి రైతులకు తక్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.గురువారం మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని కొండెం–మంచిప్ప చెరువు ప్రాంతాన్ని సందర్శించిన వారు రైతులతో సమావేశమై సమస్యలు, వినతులు స్వీకరించి ప్రాజెక్టు పురోగతిపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2009–2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అసలు ప్రణాళిక ప్రకారం సుమారు రూ.1,300 కోట్ల అంచనాతో ప్రాజెక్టు చేపట్టగా, దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో 85 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో అసలు ప్రణాళికను మార్చిందని ఆరోపించారు.
రీడిజైన్ కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ.3,000 కోట్లకు పెరిగిందని, భారీగా ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ రైతులకు ఆశించిన ప్రయోజనం అందలేదని వారు విమర్శించారు. తక్కువ వ్యయంతో పూర్తయ్యే పనులను అధిక వ్యయంతో మార్చడం వెనుక కమిషన్ల రాజకీయాలే కారణమని ఆరోపించారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గతంలో రూపొందించిన పాత డిజైన్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక ప్రణాళికలను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
రైతుల విజ్ఞప్తి మేరకు మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టు ద్వారా సిరికొండ, ధర్పల్లి మండలాలకు ఓపెన్ కెనాల్ ద్వారా సాగునీరు అందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రైతుల భూములకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లోని సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. సుమారు 50 కిలోమీటర్ల మేర ఓపెన్ కెనాల్స్ నిర్మాణం ద్వారా వ్యవసాయానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.త్వరలో సాంకేతిక ప్రణాళికలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజాధనాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

