Breaking News

ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: ముత్యాల సునీల్ కుమార్

భీంగల్, జూలై 16: E6 న్యూస్ తాటికొండ గంగాధర్

బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన బాధ్యతలను పూర్తిగా విస్మరించి, ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమయ్యారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆరోపించారు. భీంగల్ మండల కేంద్రంలోని ప్రతిపాదిత 100 పడకల ఆసుపత్రి వద్ద గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 జూన్ 18న రూ.35 కోట్ల అంచనా వ్యయంతో 10 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని అప్పటి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు భూమిపూజ చేసి, ఎనిమిది నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసిందని, అవసరమైన మేరకు మరిన్ని నిధులు విడుదల చేసి ఆసుపత్రిని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.అదేవిధంగా 2021లో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేసి, టీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.1 కోటి, ప్రత్యేక నిధుల నుంచి రూ.2 కోట్లు కేటాయిస్తామని ప్రకటించినప్పటికీ, గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.

భీంగల్ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ప్రశాంత్ రెడ్డేనని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు పనులు చేపట్టేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారని అన్నారు. గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భీంగల్ బస్ డిపోను ఏర్పాటు చేయలేకపోయారని, ఎన్నికల ముందు కొన్ని బస్సులు తీసుకొచ్చి డిపో పేరుతో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు.భీంగల్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రూ.54 కోట్ల నిధులు మంజూరు చేసిందని, అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో పూర్తి చేస్తోందని తెలిపారు. యూరియా యాప్, సాగునీటి అంశాలపై కూడా ప్రశాంత్ రెడ్డి రైతుల్లో అనవసర గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ, గతంలో లీకేజీ నీటిని కోరిన రైతులపై కేసులు పెట్టించిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిదేనని అన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక్క టీఎంసీ నీటినైనా ఎస్సారెస్పీలోకి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పేరుతో కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కరువు పరిస్థితులను కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్న ప్రశాంత్ రెడ్డి ఇకనైనా రాజకీయ విమర్శలు మానుకుని ఎమ్మెల్యేగా తన బాధ్యతలను గుర్తుంచుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ముత్యాల సునీల్ కుమార్ సూచించారు.ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *