అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి: గౌడ జన హక్కుల పోరాట సమితి
నిర్మల్, జూలై 16: E6 న్యూస్ తిరుపతి గౌడ్
గౌడ, యాదవ సమాజాలపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కనకా గౌడ్ డిమాండ్ చేశారు.
గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గౌడ, యాదవ సమాజాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండనీయమని అన్నారు. సమాజాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించే వారిపై ప్రభుత్వం రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.తెలంగాణ నిర్మాణం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణలో గౌడ, యాదవ సమాజాలు విశేష సేవలు అందించాయని, అలాంటి సమాజాలను కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి, సంబంధిత నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పార్టీ పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే గౌడ, యాదవ సమాజాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసి సంబంధిత నాయకులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

